Oxygen Movie Review And Rating By Audience


Spread the love

చిత్రం : ‘ఆక్సిజన్’

నటీనటులు: గోపీచంద్ – రాశి ఖన్నా – అను ఇమ్మాన్యుయెల్ – జగపతిబాబు – కిక్ శ్యామ్ – షాయాజి షిండే – ఆలీ – సితార – బ్రహ్మాజీ – అభిమన్యు సింగ్ – నాగినీడు – చంద్రమోహన్ – సుధ తదితరులు

సంగీతం: యువన్ శంకర్ రాజా

ఛాయాగ్రహణం: ఛోటా కే నాయుడు – వెట్రి

నిర్మాత: ఐశ్వర్య

స్క్రీన్ ప్లే: ఎ.ఎం.రత్నం

కథ – దర్శకత్వం: ఎ.ఎం.జ్యోతికృష్ణ

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న కథానాయకుడు గోపీచంద్. అతడి కొత్త సినిమా ‘ఆక్సిజన్’ కూడా విడుదల విషయంలో చాలా ఇబ్బందులు పడింది. వాయిదాల మీద వాయిదాలు పడ్డ ఈ సినిమా.. ఎట్టకేలకు ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఎ.ఎం.రత్నం తనయుడు జ్యోతికృష్ణ రూపొందించిన ఈ సినిమా అయినా గోపీచంద్ కు ఆశించిన ఫలితాన్నిచ్చేలా ఉందా.. చూద్దాం పదండి.

 

కథ:

కృష్ణ ప్రసాద్ (గోపీచంద్) అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేసే కుర్రాడు. అతను పెళ్లిచూపుల కోసం అతను ఇండియా వస్తాడు. ఓ పల్లెటూరిలో రఘుపతి అనే పెద్ద మనిషి కూతురైన శ్రుతితో అతడికి పెళ్లి నిశ్చయమవుతుంది. ఐతే ప్రసాద్ ను పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోవడం శ్రుతికి ఇష్టం ఉండదు. ఈ పెళ్లి చెడగొట్టడానికి ఆమె చేసిన ప్రయత్నాలేవీ ఫలించవు. ఇదిలా ఉంటే.. శ్రుతి కుటుంబం మొత్తాన్ని చంపేయాలని వారి శత్రువులు తిరుగుతుంటారు. వాళ్ల నుంచి కృష్ణప్రసాదే శ్రుతి కుటుంబాన్ని కాపాడతాడు. దీంతో శ్రుతికి అతను నచ్చేస్తాడు. అతడితో పెళ్లికి సిద్ధపడుతుంది. అంతా బాగుందనుకున్న తరుణంలో కృష్ణప్రసాద్ నిజ స్వరూపం శ్రుతికి తెలుస్తుంది. అతను వచ్చింది తనను పెళ్లి చేసుకోవడానికి కాదని.. తన కుటుంబాన్ని అంతం చేయడానికని ఆమెకు అర్థమవుతుంది. ఇంతకీ కృష్ణప్రసాద్ ఎవరు.. అతడి గతమేంటి.. శ్రుతి కుటుంబంపై అతడికున్న పగేంటి అన్నది మిగతా కథ.

కథనం – విశ్లేషణ:

హీరో.. అతడి టీం విలన్ల డెన్ లోకి వెళ్తుంది. అక్కడ ఒక సీక్రెట్ రూం ఉంటుంది. దాన్ని ఓపెన్ చేయాలంటే ఆరు అక్షరాల పాస్ వర్డ్ కొట్టాలి. మూడుసార్లు రాంగ్ పాస్ వర్డ్ కొడితే అది లాక్ అయిపోతుంది. అప్పుడు విలన్ల కుటుంబంలో సభ్యురాలైన కథానాయిక.. హీరోకు అదిరిపోయే హింట్ ఇస్తుంది. తన ఫ్యామిలీలో అందరూ జులైలోనే పుట్టారనేది ఆ హింట్. ఇక అంతే.. హీరోకు బల్బు వెలిగిపోతుంది. జులైలో పుట్టినోళ్లందరికీ ఒకటే రాశి ఉంటుందని.. ఆ రాశి కర్కాటకం అని.. దాన్ని ఇంగ్లిష్ లో ‘క్యాన్సర్’ అంటారని.. అది ఆరు అక్షరాలే అని.. దాన్నే పాస్ వర్డ్ అని డిసైడ్ అయిపోయి అక్కడ కొట్టేస్తాడు. సీక్రెట్ రూం ఓపెనైపోతుంది. ‘ఆక్సిజన్’ సినిమాలో కనిపించే చిత్రాతి చిత్రమైన సన్నివేశాల్లో ఇది ఒకటి. ఈ సినిమా ఎలా సాగుతుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.

సోషల్ కాజ్ ఉన్న కథాంశంతో సినిమా తీసినంత మాత్రాన జనాలందరికీ కనెక్టయిపోతుందనుకుంటే పొరబాటే. అలాంటి కథల్ని బలంగా.. జనాలకు హత్తుకునేలా చెప్పడం.. సందేశం మిళితం చేసి జనాల్ని ఎంటర్టైన్ చేయడం అందరికీ సాధ్యమయ్యే విద్య కాదు. ఈ విషయంలో ఎ.ఎం.రత్నం తనయుడు జ్యోతికృష్ణ పూర్తిగా ఫెయిలయ్యాడు. మంచి ఉద్దేశంతో.. సామాజిక అంశాల నేపథ్యంలో అతను కథను రాసుకోవడం వరకు ఓకే. కానీ ఆ కథను చెప్పిన తీరు మాత్రం పేలవం. కథగా చెప్పుకోవడానికి బాగానే అనిపించే ‘ఆక్సిజన్’.. సినిమాగా తేలిపోయింది. కథలోని కీలకమైన పాయింట్ ను ఎమోషనల్ గా కనెక్టయ్యేలా చెప్పడంలోనే జ్యోతికృష్ణ ఫెయిలయ్యాడు. దీనికి తోడు అనవసరమైన.. అర్థ రహితమైన సన్నివేశాలు.. కథతో సంబంధం లేని ఎపిసోడ్లు సినిమాను మరింతగా నీరుగార్చేశాయి.

 

‘పోకిరి’ సినిమాలో ట్విస్టు పేలిందని.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయిందని.. గత దశాబ్ద కాలంలో ఎన్ని సినిమాలు ఇలా ట్విస్టుల మీదే నడిచాయో లెక్కలేదు. ఐతే కథలో భాగంగా ట్విస్టు వస్తే ఓకే కానీ.. కేవలం ట్విస్టుల్నే నమ్ముకుని.. ఆ ట్విస్టుల చుట్టూనే కథల్ని నడిపిస్తే.. ఆ సినిమా ఎంత పేలవంగా తయారవుతుందనడానికి కూడా ‘ఆక్సిజన్’ ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఇందులో ఇంటర్వెల్ ముంగిట వచ్చే ట్విస్టు చూస్తే.. ఆ క్షణంలో షాక్ అవుతాం. కానీ సినిమా అంతా అయ్యాక ఆ ట్విస్టు గురించి ఆలోచిస్తే.. దాని కంటే ముందు వచ్చిన కథనమంతా చూసుకుంటే అర్థ రహితంగా అనిపిస్తుంది. ఈ ట్విస్టు వచ్చాక ప్రేక్షకుడు థ్రిల్ అయిపోతాడు కాబట్టి.. అంతకుముందు వరకు ఏం చూపించినా పర్వాలేదు అన్నట్లుగా తయారైంది వ్యవహారం. ప్రథమార్ధంలో గంట పాటు హీరోయిన్ పెళ్లిచూపులు.. ఆమె పెళ్లిచూపులు చెడగొట్టుకోవడానికి చేసే ప్రయత్నాల చుట్టూ నడిచిన కథనం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. ఇక్కడే ‘ఆక్సిజన్’ ఫలితమేంటో తెలిసిపోతుంది.

ఇంటర్వెల్ ట్విస్టు తర్వాత అనుకున్నట్లే ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. అందులో ఏ ప్రత్యేకతా లేదు. ఓవర్ డోస్ సెంటిమెంటుతో చాలా రొటీన్ గా సాగిపోతుంది ఆ ఫ్లాష్ బ్యాక్. అదే లెంగ్తీ అయిందనుకుంటే.. ఇక ఆ తర్వాత క్లైమాక్స్ వరకు సాగదీసిన తీరు మరింతగా విసిగిస్తుంది. ఒక పల్లెటూరిలో మామూలుగా జీవనం సాగించే ఒక కుటుంబం.. ఎవరికి తెలియకుండా ఒక డ్రగ్ రాకెంట్ ను నడిపించడం.. వేల కోట్లు ఆర్జించడం అనే పాయింటే చాలా అసహజంగా అనిపిస్తుంది. ఈ ఎపిసోడ్ అంతటినీ డీల్ చేసిన విధానం కూడా ఈ అసహజత్వాన్ని మరింత పెంచేలా ఉంది. ఒక దశ దాటాక సినిమా సాగుతున్న తీరు చూస్తే.. ఇటు నటీనటులకు.. అటు సాంకేతిక నిపుణులకు దీనిపై పూర్తిగా నమ్మకం పోయిందేమో.. ఎవరూ ఏమాత్రం ఆసక్తి లేకుండా పని చేశారేమో అనిపిస్తుంది. ఎండ్ టైటిల్స్ పడే సమయానికి.. ఒకసారి ప్రథమార్ధాన్ని గుర్తు చేసుకుంటే.. రెండు వేర్వేరు సినిమాలు చూసిన భావన కలుగుతుంది. ఎన్నడూ లేని విధంగా గోపీచంద్ కు కొన్ని సన్నివేశాల్లో ఎవరో డబ్బింగ్ చెప్పడాన్ని బట్టి ఈ సినిమా పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టే ‘ఆక్సిజన్’ ఎందుకింత ఆలస్యమైందో.. ఈ సినిమా విషయంలో గోపీచంద్ ఎందుకంత నిరాసక్తంగా కనిపించాడన్నది కూడా అర్థమైపోతుంది.

నటీనటులు:

గోపీచంద్ కొత్తగా ఏమీ చేసింది లేదు. తనకు అలవాటైన రీతిలోనే కనిపించాడు. నటన పరంగా కొత్తగా చేయడానికేమీ లేకపోయింది ఈ సినిమాలో. అతడి లుక్ మాత్రం బాగుంది. ఇంటర్వెల్ దగ్గర.. ద్వితీయార్దంలో మాస్ ప్రేక్షకుల్ని అలరించేలా కనిపించాడు గోపీ. హీరోయిన్లు రాశి ఖన్నా.. అను ఇమ్మాన్యుయెల్.. ఇద్దరూ తేలిపోయారు. ముఖ్యంగా అను ఏమాత్రం ఆకర్షణీయంగా లేదు ఈ సినిమాలో. రెండేళ్ల ముందు నటించడం వల్లో ఏమో.. చిన్న పిల్లలా అనిపించింది. గోపీచంద్ పక్కన అసలేమాత్రం సెట్టవ్వలేదు. రాశి ఖన్నా కూడా చేసిందేమీ లేదు. జగపతిబాబుది పేలవమైన పాత్ర. చివర్లో లుక్ మార్చి షాకిచ్చే ప్రయత్నం చేశాడు. అది ఫలించలేదు. కిక్ శ్యామ్.. అభిమన్యు సింగ్.. శ్రవణ్.. బ్రహ్మాజీ.. నాగినీడు.. ఇలా చెప్పుకోవడానికి చాలా పెద్ద తారాగణమే ఉంది కానీ.. ఎవరికీ సరైన పాత్రల్లేవు. ఆలీ కామెడీ కూడా పెద్దగా నవ్వించలేదు.

సాంకేతికవర్గం:

యువన్ శంకర్ రాజా ఇంతకుముందు తెలుగులో మంచి అభిరుచి ఉన్న సినిమాలు చేశాడు. అందులో అతడి సంగీతం విని ఫిదా అయిన వాళ్లకు ‘ఆక్సిజన్’ పెద్ద షాకిస్తుంది. ఈ సినిమాకు నిజంగా అతనే పని చేశాడా అన్న సందేహాలు కలుగుతాయి. పాటలు కానీ.. నేపథ్య సంగీతం కానీ.. ఎంతమాత్రం యువన్ స్థాయికి తగ్గట్లు లేవు. పాటల్లో ఒక్కటి కూడా గుర్తుంచుకునేలా లేదు. ఈ సినిమాకు ఆరుగురు ఛాయాగ్రాహకులు పని చేసినట్లుగా చెప్పాడు దర్శకుడు. కానీ ఎవరూ మనసు పెట్టి చేసినట్లు లేరు. సినిమా లుక్ రకరకాలుగా కనిపిస్తుంది. నిర్మాణ విలువలు జస్ట్ ఓకే అనిపిస్తాయి. దర్శకుడు జ్యోతికృష్ణ ఎంచుకున్న కథ వరకు పర్వాలేదు. కానీ దాన్ని చాలా పేలవంగా.. అపరిపక్వంగా తెరకెక్కించాడు. ఈ కథలో కొంతవరకు ‘రామయ్యా వస్తావయ్యా’ ఛాయలు కూడా కనిపిస్తాయి. ఎ.ఎం.రత్నం స్క్రీన్ ప్లేలోనూ ఏ విశేషం లేదు. పదేళ్లకు పైగా విరామం తర్వాత మెగా ఫోన్ పట్టిన జ్యోతికృష్ణ ఔట్ డేట్ అయిపోయాడనిపిస్తుంది సినిమా చూస్తుంటే.

చివరగా: ఆక్సిజన్.. ఊపిరాడనివ్వదు!

reference : http://www.tupaki.com/movienews/article/Oxygen-Review/172107

రేటింగ్- 2/5 times of india

 

 

 

 

for more detilas : http://www.back2news.com/

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Oxygen Movie Review And Rating By Audience

log in

reset password

Back to
log in